హైదరాబాద్ పాతబస్తీలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. హుస్సేనియాలం పోలీస్స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద టీఎస్ఎస్పీ (TSSP) కానిస్టేబుల్ బాలేశ్వర్ 10వ బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్ల వారు జామున తన సర్వీస్ గన్ (Service gun)తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హుస్సేనీ హలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. అయితే కానిస్టేబుల్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలేశ్వర్ స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చం పేట్ మండలం, లక్ష్మీ పూర్ గ్రామం. ఆరునెలలుగా పాతబస్తీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉగాది పండుగ రెండు రోజుల్లోనే బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. పండుగ రోజు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నా ఉన్నతాధికారులు మంజూరు చేయనట్లు సమాచారం.
దీంతో మనస్తాపానికి గురైన బాలేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాలేశ్వర్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కుటుంబ కలహాలేమీ లేవని స్పష్టం చేశారు. తాము ఆర్థికంగా స్థిరపడిన వారిమేనని చెబుతున్నారు. బాలేశ్వర్ది సూసైడ్ కాదని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి బాలేశ్వర్ తమతో మాట్లాడాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎలాంటి ఆందోళన పడకుండా ఎప్పటిలాగే బాగానే మాట్లాడినట్లు చెప్పారు. ఇంతలోనే ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గన్ మిస్ ఫైర్ వల్ల జరిగిందని ముందుగా అధికారులు తమతో చెప్పారని వెల్లడించారు. తామూ అదే నిజమని అనుకున్నట్లు చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక అనంతరం అసలు నిజాలు బయటపడే అవకాశమున్నట్లు పోలీసులు వెల్లడించారు.