తుక్కుగూడలో కాంగ్రెస్(Congress Tukkuguda sabha) పార్టీ నిర్వహించిన జనజాతర సభపై బీజేపీ(BJP) సీనియర్ నేత,రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్(Mp Laxman) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసిన ‘పాంచ్ న్యాయ పత్ర’ మేనిఫెస్టోపై ఆయన విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరుతో ప్రజలను వంచించడానికి, పంగనామాలు పెట్టడానికి చూస్తోందన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ చేతుల మీదుగా ఓబీసీ మోర్చా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు చేయూత కింద రూ.2500 ఇవ్వలేనివాళ్లు లక్ష రూపాయలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని సెటైర్ వేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. ఆ పార్టీలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ పేరు చెప్పి మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీకి చెందిన కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ఇచ్చి గౌరవించిందన్నారు. 70 శాతం ఎస్టీ, ఎస్టీ, బీసీలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించినట్లు గుర్తుచేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయాలని తాము భావిస్తే ఆమెను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ చూసిందని ధ్వజమెత్తారు. కుటంబ పాలనకు , అవినీతి పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్ పాలన అని విమర్శించారు.