పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న పార్టీలు, నేతల మధ్య కొత్త దోస్తానా కుదురుతోంది. జంప్ జిలానీలు సొంత పార్టీని వీడి మరో పార్టీలోకి మారుతున్నారు. రాజకీయాల్లో మిత్రుత్వమే కానీ శత్రుత్వం ఉండదని కొందరు నేతలు ఇప్పటికే ప్రూవ్ చేశారు.
ఇదిలాఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ మధ్య కొత్త స్నేహం చిగురించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హస్తం పార్టీ నేతల, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్(Asaduddin) గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఫిరోజ్ ఖాన్(Firozkhan) వెల్లడించారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య దోస్తీ ఫిక్స్ అయ్యిందని, అసద్ గెలుపుకోసం కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి నేటికి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఫిక్స్ చేయలేదని అన్నారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీల మధ్య మైత్రి బహిర్గతం అయిందని స్పష్టంచేశారు.
తమ పార్టీ అసదుద్దీన్‌కు హెల్ప్ చేసినా.. తనకు, అసద్‌కు మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందని, కాకపోతే ఎంపీ ఎన్నికల్లో తన పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదిలాఉండగా, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను బీజేపీ హైకమాండ్ ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే అసదుద్దీన్‌ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.