ఉత్తర కొరియా(North Korea) ఇటీవల ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేసింది. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్దమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సంచలన వ్యాఖ్యలు చేశారు.
యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియాలోని ‘కిమ్ యూనివర్సిటీ ఆఫ్ మిలిటరీ’(Kim University of Military)ని కిమ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తమ దేశం చుట్టూ ఉన్న అస్థిర భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు సమయం ఆసన్నమైందంటూ నొక్కి చెప్పారు.
2011లో కిమ్ తన తండ్రి పేరుతో ఈ యూనివర్సిటీని నిర్మించారు. ఈ యూనివర్సిటీ సైనిక విద్యలో అత్యున్నత స్థానంలో ఉండటం గమనార్హం. అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో తరచూ ఉత్తర కొరియాను కవ్విస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
అటు రష్యాతో ఉత్తర కొరియా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలోనూ రష్యాకు సాయం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా రష్యాకు సాయం అందిస్తున్నట్లు సమాచారం. తాజాగా కిమ్ వ్యాఖ్యలు యుద్ధ ఆలోచనలపై బలాన్ని చేకూర్చాయి.