భారత క్రికెట్లోనే అత్యుత్తమ పేసర్లలో ఒకరైన ‘జస్రీత్ బుమ్రా’ (Jasprit Bumrah) గురించి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే బుమ్రా ఓ సమయంలో కెనడాకు వెళ్లి స్థిరపడాలనుకున్నాడట. అంతేకాదు కెనడా క్రికెట్ జట్టుకు ప్రతినిధ్యం వహించాలనుకున్నాడట. ఈ విషయాన్ని మరెవరో కాదు.. స్వయంగా బుమ్రానే తెలిపాడు.
తన సతీమణి, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్(Sanjana Ganeshan)తో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బుమ్రా ఈ విషయాన్ని వెల్లడించాడు. నువ్వు ఒకప్పుడు కెనడా(Canada)కు వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్నావు కదా.. అని జస్రీత్ బుమ్రాను సంజన గణేశన్ అడిగారు. అందుకు బుమ్రా ఈ విధంగా స్పందించాడు. నిజంగానే అప్పట్లో ఆ ఆలోచన వచ్చిందని తెలిపాడు.
భారత్‌లో ప్రతీ కుర్రాడు క్రికెట్ ఆడాలనుకుంటాడని, అందులోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలుగనే వారు ప్రతీ వీధిలో ఓ పాతికమంది ఉంటారని వ్యాఖ్యానించాడు. అందుకే తాను ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా కెనడా వెళ్లాలనుకున్నానని బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే తాను అనుకున్నది జరగలేదని దానికి గల కారణాలను తెలిపాడు. తన మేనమామ కెనడాలో ఉన్నారని, తాను చదువు పూర్తయ్యాక అక్కడికి వెళ్లి స్థిరపడాలని అనుకున్నట్లు బుమ్రా తెలిపాడు.
అయితే అక్కడ భిన్నమైన సంస్కృతి ఉంటుందన్న కారణంతో తన తల్లి అక్కడికి వెళ్లనివ్వలేదని తెలిపాడు. ఆ కారణం వల్లే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని, ఆ తర్వాతే తనకు బాగా కలిసి వచ్చిందని చెప్పాడు. ఐపీఎల్‌తో పాటు టీమిండియాలో చోటు దక్కిందని తెలిపాడు. లేదంటే తాను కెనడాకు వెళ్లి.. ఆ దేశ క్రికెట్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నించేవాడిని స్పష్టం చేశాడు.
ఇక్కడే ఉన్నందుకు తాను చాలా అదృష్టవంతుడినని తెలిపాడు. ఇక, 2013లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన బుమ్రా 2016లో భారత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎనిమిదేళ్లుగా తన అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 89 వన్డేలు, 62 టీ20లు, 36 టెస్టులు ఆడాడు. ఇక ఐపీఎల్లో 125 మ్యాచులు ఆడాడు.