మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై (Mega Engineering Company)సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రూ. 314 కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల బిల్లులను ఆమోదించేందుకు ఎనిమిది మంది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) అధికారులకు లక్షలు లంచం ఇచ్చిందని ఆరోపించింది.
జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన పనుల విషయంలో రూ.174 కోట్ల బిల్లులను పొందేందుకు సుమారు రూ.78 లక్షలు ముట్ట చెప్పినట్లు తెలిపిన సీబీఐ.. ఆ సంస్థకు చెందిన 8 మంది, మరో ఇద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. నగర్ నార్ స్టీల్ ప్లాంట్‌లో రూ.314 కోట్లతో బావి, పంప్ హౌజ్, పైప్‌లైన్ సిస్టం నిర్మించి అయిదేళ్ల పాటు నిర్వహించేందుకు మేఘా కంపెనీతో ఎన్ఎండీసీ 2015 జనవరి 23న ఒప్పందం చేసుకొంది.
ఈ క్రమంలో రాంచీలోని మెకాన్ లిమిటెడ్ కు స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. అయితే కాంట్రాక్టుకు సంబంధించిన మేఘా కంపెనీకి 2018 నుంచి 2020 మధ్య రూ.174 కోట్ల బిల్లులు మంజూరయ్యాయి. కాగా ఈ బిల్లులు పొందడానికి ముడుపులు చెల్లించినట్లు సీబీఐ అభియోగించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆ సంస్థ జీఎం సుభాష్ చంద్ర సంగ్రాస్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది.
మరోవైపు మేఘా కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో రూ.966 కోట్లు చెల్లించగా.. అందులో ఎక్కువగా బీజేపీ, బీఆర్ఎస్ లకే విరాళాల రూపంలో అందించినట్లు ఆరోపణలున్నాయి.. ఈ క్రమంలో దేశంలో రాజకీయ పార్టీలకు ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన రెండవ కంపెనీగా ఈ సంస్థ నిలిచిన విషయం తెలిసిందే..