వారం రోజులుగా తెలంగాణ(Telangana) వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి నుంచి ప్రజలు కాస్త ఉపశమనాన్ని పొందాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. అయితే, ఈ వారం మాత్రం ఆ పరిస్థితి ఉండదంటున్నారు ఐఎండీ(IMD) అధికారులు.
హైదరాబాద్(Hyderabad)లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ ఈ వారమంతా భారీ ఉష్ణోగ్రతలు(High Temperature) నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటికే మూసాపేటలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకారం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అయితే రాష్ట్రంలో మరోసారి భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా మాడుగులపల్లి మండలంలో 43.3, తిరుమలాయపాలెం మండలంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 42.6 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో 2.5 డిగ్రీలు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉదయం 11గంటల నుంచి 4గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు గర్భణులు, బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైన పానీయాలను తాగాలని సూచించారు.