ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జజ్‌పుర్ జిల్లా(Jajpur District)లోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 38 మందికి తీవ్రగాయాలయ్యాయి.
కటక్ నుంచి బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ(Cuttack SCB Medical College)కి తరలించారు.
బస్సు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అస్తవ్యస్తంగా డ్రైవింగ్ చేయడం చూశామని స్థానికులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ తాగి ఉన్నాడని భావిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.