అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్(BRS) పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. అధికారం కోల్పోవడంతో ఇన్ని రోజులు ఆ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. కేసీఆర్‌కు ఎంతో నమ్మకంగా ఉన్న ముఖ్యనేతలు కూడా పార్టీని వీడుతున్నారు. వీరంతా అధికారపార్టీ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి క్యూ కడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్(Rajendra Nagar MLA Prakash Goud) బీఆర్ఎస్ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. దీంతో ప్రకాష్‌గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారానికి బలం చేకూరింది. ఈ మేరకు నేడో, రేపో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ లిస్టులో ప్రకాష్‌గౌడ్ చేరనున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. ఆయనతో చాలా సేపటి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలోని చేరనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా మంచి మిత్రులు.
వీరిద్దరూ టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తరువాత జరిగిన పరిణమాల్లో ప్రకాష్‌గౌడ్ బీఆర్ఎస్లో చేరగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయనను కలిశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆయన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ రేవంత్‌ను కలవగా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రకాష్‌గౌడ్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.