రేవంత్ రెడ్డి, హరీష్ రావు మంచి మిత్రులు, బొమ్మ బొరుసు సంబంధం అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) విమర్శించారు. హైదరాబాద్(Hyderabad)లోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్(BRS)కు రాష్ట్రంలో ఒక్కసీటు రాదన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ మెడలు వంచి కాషాయజెండా ఎగురవేశామని గుర్తు చేశారు.
రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి ప్రధాని మోడీ(PM Modi)ని విమర్శించే అర్హత లేదని.. మోడీ వెంట్రుకకు కూడా సరిపోడని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని తెలిపారు. ఇటీవల మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ బీజేపీ, రఘునందర్ రావుపై విమర్శలు గుప్పించారు. మెదక్‌కు బీజేపీ ఏం చేయలేదని రఘునందన్ రావుకు గడీలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి సామాన్యుడని చెప్పుకొచ్చారు. అయితే, సీఎం వ్యాఖ్యలపై తాజాగా రఘునందన్ రావు స్పందించారు.
ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. రేవంత్ రెడ్డికి 48 గంటల టైమ్ ఇస్తున్నానని చెబుతూ తనకు గడీ ఉందని నిరూపిస్తే ఆ గడీ ఆయన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిస్తానని సవాల్ చేశారు. అంతేకాదు.. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తానే భరిస్తానని చెప్పారు. అదేవిధంగా మెదక్‌కు బీజేపీ ఏం చేసిందో బుక్ తయారు చేశానని ఆ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కొరియర్ చేస్తున్నానని చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి కాదని రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారని విమర్శించారు. కెసిఆర్ పిట్టల దొర అనుకుంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అంతకు రెండoతలు ఉందని ఎద్దేవా చేశారు.
మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని, బ్యాంకులను జాతీయం చేసి నలభై ఏళ్లు అయినా ఒక్క పేదోడు బ్యాంకు మెట్లు ఎక్కనివ్వని చరిత్ర కాంగ్రెస్‌ది అని తెలిపారు. జీవన్‌రెడ్డికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ఇస్తాననడం కాదు.. చేతనైతే ముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చేయండని హితవుపలికారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనక ఉన్నది మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులు అంటూ రఘునందన్‌రావు ఆరోపించారు.