మోడీ(PM Modi)పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం దుస్థితి నెలకొందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం వందేళ్ల విధ్వంసం పేరుతో బీజేపీ పాలనపై ప్రజా చార్జిషీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఓ రాష్ట్రంపై మరొక రాష్ట్రం దాడి చేసి సంపదను దోచుకునేవని అన్నారు.
ప్రస్తుతం మోడీ హయాంలో దేశంలో అదే ధోరణి కోణసాగుతోందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని, దేశ సంపదను కొద్ది మందికి కట్టబట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన చేసి సంపదను అధిక శాతం జనాభాకు పంచడమే రాహుల్‌గాంధీ ధ్యేయమని తెలిపారు.
గత ఎన్నికల్లో కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్ల ధనం వెలికితీసి పేదల ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున జమ చేస్తామని మోసం చేశారని అన్నారు. పదేళ్లు మోడీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసని రాబోయే ఎన్నికల్లోనూ మోసపూరిత హామీలు ఇస్తోందని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీని అరికడతామని చెప్పి పదేళ్లవుతున్నా ఇంత వరకు ఆ హామీకి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు.
రాజ్యాంగాన్ని, లౌకికవాదం, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని తెలిపారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. చార్జ్ షీట్లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతీ పౌరుడికి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ శ్రేణులు సైన్యంలా కదిలి కృషి చేయాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.