పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ పోలరైజేషన్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూవులు ప్రశాంతంగా ఉండలేరని, వారి ఆస్తులు లాక్కుంటారని, హనుమాన్ చాలీసా చదవనివ్వరని ప్రచారం చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఆయన సోషల్ మీడియా ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవనివ్వమని అంటున్నారు.. మన ఆస్తులు ముస్లింలకు ఇస్తామని అబద్ధాలు ఆడుతున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ ఆలయాలు లేవా? హనుమాన్ చాలీసాలు చదవలేదా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వెళ్లి పర్యటించావా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎంత మంది హిందువులకు న్యాయం చేశారు? సంపద అంతా అదానీ, అంబానీలకు పంచి పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు.
గురువారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి ఇప్పటికే సూరత్ పార్లమెంట్ సెగ్మెంటును గెలుచుకున్నామని అంటున్నారని, బెదిరించి గెలుచుకోవడం కాదు.. ఓట్లతో గెలుచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవాచేశారు. కాగా, భవిష్యత్‌లో రైతులకు సాగు నీరు, నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.