ఇవాళ తెలంగాణా (Telangana) లో పలు జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ (Congress party) సమావేశాల్లో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం, ఒకర్ని ఒకరు దుర్భాషలాడటం జరిగింది. దీంతో ఆ సమావేశాలకు హాజరైన సీనియర్ లీడర్లు (Senior Leaders) సైతం ఏం చేయాలో తెలియక మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పలువురు కార్యకర్తలకు గాయాలైయ్యాయి. ఇవాళ సత్తుపత్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఈ దృశ్యాలు కనిపించాయి. కార్యక్రమం అంతా రసాభసాగా మారింది. నియోజకవర్గానికి చెందిన మానవతారాయ్, మట్టా దయానంద్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎదుటే బహబహీకి దిగారు. పోటాపోటీగా నినాదాలు చేస్తూ కుర్చీలతో కొట్టుకున్నారు. పలువురికి గాయాలైయ్యారు. దీంతో రేణుకా చౌదరి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కూడా ఇదే సీన్ కనిపించింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోటా పోటీగా సమావేశాలు నిర్వహిస్తూ.. బలప్రదర్శన చేసుకుంటున్నారు.
ఈ సమావేశాలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా నిర్వహించడంతో గందరగోళ వాతావరణం కనిపించింది. ఏదైనా జరుగుతుందేమోనని ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపించాయి.
కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో సోనియా గాంధీ నిర్వహించే సభకు జన సమీకరణ చేయడం కోసం. పార్టీ అధినాయకత్వం తెలంగాణా వస్తున్న తరుణంలో ఆ పార్టీ లో జరుగుతున్న కుమ్ములాటలు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంత నష్టం చేకూరుస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.