బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తాజాగా ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఈ కేసులో ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ అయ్యారు.
దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అప్రూవర్ గా మారిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. అంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహాయకుడు దినోష్ అరోరా అప్రూవర్ అయ్యారు. తాజాగా వారంతా అప్రూవర్ గా మారిన నేపథ్యంలో కవితకు ఈడీ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో శరత్ చంద్రా రెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డిలు బెయిల్ పై బయటకు వచ్చారు. హైదరాబాద్ వ్యాపార వేత్త అరుణ్ రామ చంద్ర పిళ్లై, బోయిన పల్లి అభిషేక్ రావులు ప్రస్తుతం ఇంకా జైలులోనే వున్నారు. ఇక ఈ కేసులో కవితను ఇప్పటికే ఈడీ పలు మార్లు ప్రశ్నించింది.
ఈ ఏడాది మార్చి 16, 20, 21 తేదీల్లో కవితను ఈడీ విచారించింది. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ఆమెను ఈడీ విచారించింది. కవితను అరెస్టు చేస్తారంటూ గతంలో పలు మార్లు ప్రచారం జరిగింది. కానీ అంతా అనుకున్నట్టుగా ఆమెను అరెస్టు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆమెకు నోటీసులు పంపిచడంతో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.