Telugu News » Telangana : ఎన్నికల యుద్ధం.. రాష్ట్రానికి క్యూ కట్టిన జాతీయ నేతలు!

Telangana : ఎన్నికల యుద్ధం.. రాష్ట్రానికి క్యూ కట్టిన జాతీయ నేతలు!

అధికార బీఆర్‌ఎస్‌ 17న పబ్లిక్‌ గార్డెన్‌ లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా తెలంగాణ విమోచన సభకు బీజేపీ సిద్ధమైంది. ఇదే రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది.

by admin
all parties exercise for candidates

– ఒక రోజు ముందే తెలంగాణకు అమిత్ షా
– అంతకంటే ముందే రాహుల్, ప్రియాంక ఎంట్రీ
– బీజేపీ, కాంగ్రెస్ లో జోష్
– ఎవరి అజెండా వారిదే..
– అన్ని పార్టీల టార్గెట్ ఒక్కటే!
– 17న పోటాపోటీగా సభలు
– కేసీఆర్ లక్ష్యంగా పేలనున్న పంచ్ లు
– తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట..
– బీఆర్ఎస్ కార్యక్రమాలు

తెలంగాణ (Telangana) లో ఎన్నికల హడావుడి స్పీడందుకుంటోంది. ఓవైపు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల్ని ముందే ప్రకటించి ప్రచారం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అభ్యర్థుల వడపోతలో ఉన్నాయి. మూడు పార్టీల టార్గెట్ అధికారమే. ఈ క్రమంలో ఏ కార్యక్రమం చేపట్టినా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పుడు సెప్టెంబర్ 17పైనే ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీలు.. మూడు కార్యక్రమాలకు పూనుకున్నాయి.

all parties exercise for candidates

అధికార బీఆర్‌ఎస్‌ 17న పబ్లిక్‌ గార్డెన్‌ లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్‌ (CM KCR) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అలాగే, జిల్లాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా తెలంగాణ విమోచన సభకు బీజేపీ సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సభ కోసం భారీగా జన సమీకరణలో మునిగిపోయిపోయింది బీజేపీ. ఇక, ఇదే రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. తుక్కుగూడలో జరగనున్న ఈ సభకు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్, ప్రియాంక సహా ఇతర జాతీయ నేతలు హాజరవుతున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది కాంగ్రెస్ పార్టీ.

బీజేపీ, కాంగ్రెస్ సభల నేపథ్యంలో జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కట్టారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు అమిత్ షా. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. తెలంగాణ బీజేపీ నేతలతో కీలక భేటీలు జరపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి 7.55 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 8 గంటలకు సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌ కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. తర్వాతి రోజు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభకు హాజరవుతారు. కవితకు ఈడీ నోటీసులు, కాంగ్రెస్ సభ నేపథ్యంలో అమిత్ షా చేయబోయే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

ఇటు అమిత్ షా కంటే ముందే తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి వస్తారు. నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌ లో సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం తుక్కుగూడ సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్ నుంచే రాత్రి 8.50 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. కాంగ్రెస్ సభ నేపథ్యంలో శుక్రవారం ఏఏసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మాజీ మంత్రి జైరాం రమేష్‌ రాష్ట్రానికి వచ్చారు. తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని మణిక్‌ రావు థాక్రే, రేవంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం వేణుగోపాల్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్‌ ప్రజలను ఇరిటేట్‌ చేస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం ఇండియా కూటమివైపు చూస్తోందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. రిజర్వేషన్‌ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్‌ పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. మొత్తంగా సెప్టెంబర్ 17న కార్యక్రమాల నేపథ్యంలో మూడు పార్టీల్లో సందడి వాతావరణం నెలకొంది.

You may also like

Leave a Comment