జనసేన ( Jana Sena) కు ఎన్నికల గుర్తు విషయంలో ఇబ్బందులు తొలగిపోయాయి. తాజాగా జనసేనకు మరోసారి గ్లాసు (Glass) గుర్తును కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల ( Election Comission) సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. మరోసారి గ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన సంతోషం వ్యక్తం చేసింది. గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘానికి జనసేన కృతజ్ఞతలు తెలిపింది.
గతంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గ్లాసు గుర్తుపైనే పోటీ చేసింది. ఏపీలో 137 స్థానాలు, తెలంగాణలో 7 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇది ఇలా వుంటే కొద్ది నెలల క్రితం దేశ వ్యాప్తంగా వున్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
అందులో జనసేనకు చెందిన గ్లాసు గుర్తున ఫ్రీ గుర్తుగా ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక పార్టీ తమకు కేటాయించిన గుర్తును కాపాడుకోవాలంటే ఆ పార్టీ నిర్దేశిత ఓట్ల శాతాన్ని పొందాల్సి వుంటుంది. కానీ ఆ ఓట్ల శాతాన్ని పొందడంలో జనసేన విఫలం కావడంతో ఆ గుర్తును కాపాడుకోలేక పోయిందని ఎన్నికల సంఘం తెలిపింది.
మరి కొన్ని నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో బరిలో దిగాలని జనసేన భావిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు జనసేన అభ్యర్థులు రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని జనసేన పేర్కొంది.