పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి, జీవితంలో చివరి రోజు వరకు నటించిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studios) లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏఎన్ఆర్ విగ్రహాన్ని(ANR Statue) మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అక్కినేని కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు అక్కినేని పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ…ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పరిపూర్ణమైన జీవితం అంటే అక్కినేని నాగేశ్వరరావుదేనంటూ వారంతా కొనియాడారు. అక్కినేని శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, మోహన్ బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్ చరణ్, మహేష్ బాబు, సుబ్బిరామిరెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, కీరవాణి, రాజమౌళి, తదిరత ప్రముఖులు పాల్గొన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకు చాలా అభిమానమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అక్కినేని మహానటుడే కాదు మహా మనిషి కూడా అని అన్నారు. అక్కినేనే ఒక నట విశ్వవిద్యాలయమన్న వెంకయ్యనాయుడు, తెలుగు ప్రజల హృదయాల్లో ఏఎన్ఆర్ ఇంకా జీవించే ఉన్నారన్నారు.
అక్కినేని నాగేశ్వరరావుకి వచ్చినన్ని అవార్డులు, జరిగినన్ని సన్మానాలు మరే నటుడికి జరగలేదని హస్యనటుడు బ్రహ్మనందం అన్నారు. ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ చూడటమే మహాభాగ్యమని చెప్పారు. రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి నటన అనే చిన్న అర్హతతో చేరుకుని, ఏఎన్ఆర్ మహోన్నత వ్యక్తిగా మారారని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేదని చెప్పారు.
అక్కినేని శతజయంతి ఉత్సవాలకు హాజరైన జయసుధ మాట్లాడుతూ…ఆయనతో చాలా చిత్రాలు చేయడం తన అదృష్టమని అన్నారు. వివిధ రంగాలపై ఆయనకు మంచి అవగాహన ఉందని జయసుధ తెలిపారు.
ఏఎన్ఆర్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించానని దర్శకుడు రాజమౌళి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు అందరికీ ఒక ప్రేరణనని చెప్పారు. దేవుడిపై నమ్మకం లేకున్నా.. భక్తిరస చిత్రాల్లో అద్భుతంగా నటించారని తెలిపారు.
ఏఎన్ఆర్ ఒక గ్రంథం.. పాఠ్యపుస్తకమని సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.