తెలంగాణను రక్షించుకోవాలని బీజేపీ (BJP) తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రాష్ట్రంలో హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాపాలన రావాలని వెల్లడించారు. ఖైరతాబాద్ వినాయకున్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది ఈ రోజు దర్శించుకున్నారు.
రాష్ట్రం దివాళా తీయకుండా ఆ గణనాథుని ఆశీస్సులతో మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఖైరతాబాద్ గణేషున్ని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో యువకులంతా కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారన్నారు. బాల గంగాధర్ తిలక్ ప్రోత్సాహంతో మొదటి సారిగా గణేశ్ ప్రతిష్టాపన జరిగిందని చెప్పారు.
హిందువులను ఏకం చేసేందుకు టైగర్ నరేంద్ర గణేష్ ను ప్రతిష్టించారన్నారు. ఖైరతాబాద్ లో గణేషన్ ను దివంగత శంకర్ ప్రతిష్టించారని తెలిపారు. గణేష్ ఉత్సవాల ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాయన్నారు. అంతకు ముందు నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ…. ముందుగా తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ఏం చేశారో చెప్పాలన్నారు.
17 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా గ్రూపు-1 పరీక్షను టీఎస్పీఎస్పీ ఎందుకు నిర్వహించ లేకపోయిందని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలవారీ ఆర్థిక సాయం పథకాన్ని ఎందుకు అములు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందన్నారు. ప్రధాని పర్యటనపై ప్రశ్నలు గుప్పించే ముందు బీఆర్ఎస్ నేతలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.