హిమాన్ష్ గురించి మంత్రి కేటీఆర్ (KTR) చేసిన ట్వీట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. దూరంగా ఉన్న కుమారుడు గుర్తుకు వచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లి పోతోంది కదా అని అన్నారు. మరి ఏండ్ల తరబడి ఉద్యోగం కోసం చూస్తున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగులు ఏండ్ల తరబడి తమ ఇండ్ల వైపు కూడా చూడటం లేదన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల తల్లి దండ్రుల ఆవేదన మీ లాంటిది కాదా? కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. సర్కార్ హాస్టల్స్ పెట్టే తిండి తినలేక పిల్లలు ఏడుస్తున్నారని తెలిసి వాళ్ల తల్లి దండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. వారి ఆవేదన మీలాంటి కాదనుకున్నారా అని నిలదీశారు.
కొడుకు తిరిగి రాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక అమరవీరుల కుటుంబాలు కుమిలి కుమిలి ఏడుస్తున్నాయని చెప్పారు. అమర వీరుల కుటుంబాల యాతన మీలాంటి కాదనుకున్నావా కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. మీ గ్లోబరీనా కంపెనీ 30 మంది ఇంటర్ విద్యార్థుల ఉసురు తీసిందన్నారు. ఆ విద్యార్థుల కన్న పేగుల ఆక్రందన మీలాంటిది కాదా కేటీఆర్ ను ప్రశ్నించారు.
తిండి పెట్టకుండా చిన్నారులను బీఆర్ఎస్ సర్కార్ ఏడి పిస్తోందన్నారు. ఫీజుల బకాయిలు చెల్లించక విద్యార్థులను గోస పెడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులని వంచిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంత మందిని ఇబ్బంది పెడుతున్న మీ ప్రభుత్వానికి తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.