ఒకప్పుడు ఎన్నికలు అంటే ఖర్చు తక్కువ.. ప్రచారాలు కూడా ఇంటింటికీ తిరిగి చేసే వారు. కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా కట్టే వారు. కానీ గత పది, పదిహేను సంవత్సరాల నుండి ఎలక్షన్లు రణరంగాన్ని మరిపిస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికలు వచ్చిందంటే చాలు చేసే పనులు కూడా వదులుకొని బీరు, బిర్యానీ, డబ్బుల కోసం కొందరు నేతల వెంట తిరగడమే ఉద్యోగంగా భావిస్తున్నారని.. ఈ క్రమంలో ఎన్నికల ఖర్చులు కూడా ఊహించని రేంజ్ కు ఎదిగిందనే ప్రచారాలు తరచుగా వినిపిస్తూన్నాయి.
మరోవైపు తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహలం నెలకొన్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇందుకు సోషల్ మీడియా (Social media) వేదికగా ఉండగా.. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించే ఎన్నికల ప్రచారం నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల ప్రచారంలో సాంకేతిక పుంతలు తొక్కుతుంది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు ఎల్ఈడీ (LED) ప్రచార ఫలకలూ భుజానికి తగిలించుకుని వ్యక్తులు ఊరంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేయొచ్చు. చీకట్లో కూడా ఈ తెరలపై ఉండే బొమ్మలు, రాతలు స్పష్టంగా కనిపిస్తాయి. 2 గంటలు ఛార్జింగ్ పెడితే.. 5 గంటల వరకు పని చేస్తాయని చెబుతున్నారు. కాగా ఈ కొత్త ప్రచారం పై అన్ని జిల్లా నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ కొత్త ఎన్నికల ప్రచార తెరలు సికింద్రాబాద్ కేంద్రంగా తయారవుతున్నాయి.