Telugu News » Israel-Hamas War : బాలుడి ప్రాణం తీసిన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం..!

Israel-Hamas War : బాలుడి ప్రాణం తీసిన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం..!

ఇంటి యజమాని 71 ఏళ్ల జోసఫ్‌ క్యూబా వారి పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ వెంటనే 911కి ఫోన్‌ చేసి కాపాడాల్సిందిగా పోలీసులను వేడుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే తల్లి, కుమారుడు రక్తపు మడుగుల్లో కనిపించారు.

by Venu

ఇజ్రాయెల్‌ (Israel) హమాస్‌ (Hamas War) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం తాలూకు ప్రభావం వల్ల జాతి విద్వేష ఘటనలు చోటు చేసుకోవడం సహజంగా మారింది. తాజాగా అమెరికా (America)లో ఇలాంటి దారుణం జరిగింది. విల్‌ కౌంటీ షెరిఫ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తన ఆరేళ్ల కుమారుడితో ఓ 32 ఏళ్ల పాలస్తీనీయన్‌-అమెరికన్‌ మహిళ, ఇల్లినాయిస్‌ (Illinois)లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు.

కాగా ఆ ఇంటి యజమాని 71 ఏళ్ల జోసఫ్‌ క్యూబా వారి పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ వెంటనే 911కి ఫోన్‌ చేసి కాపాడాల్సిందిగా పోలీసులను వేడుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే తల్లి, కుమారుడు రక్తపు మడుగుల్లో కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా.. బాలుడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు.

మహిళ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు బాలుడి శరీరంపై దాదాపు 26 కత్తిపోట్లు ఉన్నట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్ల దాడిని నిరసిస్తూ నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాలుడి హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన విద్వేష చర్య అని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే అమెరికా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది.. సామాజిక మాధ్యమాల్లో విద్వేష వ్యాఖ్యలు పెరిగిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణమని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

You may also like

Leave a Comment