అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ నేతల నోటి నుండి వచ్చే మాటలు ఒక్కోసారి వివాదస్పదం అవుతాయి. ఇదే క్రమంలో తమ పార్టీని కానీ, లేదా తమకు అనుకూలంగా ఉన్న పార్టీని పొగడాలని పడే తాపత్రయం దాదాపు ప్రతి నేతలో కనిపిస్తుంది.
తాజాగా హైదరాబాద్ (Hyderabad) ఎంపీ (MP) ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)..దేశ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని విభజించడం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు. అలా జరిగి ఉండకుంటే బాగుండేదన్నారు ఒవైసీ. అయితే, దేశ విభజన మహ్మద్ అలీ జిన్నా వల్ల కాదని, హిందూ మహాసభ డిమాండ్ మేరకే భారత్, పాకిస్థాన్‌లు ఏర్పాటయ్యాయని ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఏఐఎంఐఎం చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు..
మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకాన్ని చదివితే.. కాంగ్రెస్ నేతలందరికి మౌలానా ఆజాద్ అభ్యర్థన అర్థమవుతుందని ఒవైసీ అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యాటన పై కూడా స్పందించారు అసదుద్దీన్ ఒవైసీ.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు తెలంగాణ అభివృద్ధి చూసి కళ్ళు తెరుచుకుంటాయని అన్నారు.
కాంగ్రెస్ 40 ఏళ్లు అధికారంలో ఉండి అమేథీని ఎంత అభివృద్ది చేశారని ప్రశ్నించారు. 9 ఏళ్లలో అమేథీ కంటే తెలంగాణ ఎక్కువ అభివృద్ధి చెందిందని అన్నారు ఒవైసీ.. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్ చేసిన ప్రకటన కొంత సంచలనంగా మారే అవకాశం ఉందని అంటున్నారు కొందరు నెటిజన్స్.. మరోవైపు బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై కూడా ఒవైసీ దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంతా అనుకొంటున్నారు.