ప్రవల్లిక(Pravallika) అనే యువతి చనిపోతే కొందరు రాజకీయం చేశారని మంత్రి కేటీఆర్(minister ktr) విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్(Brs) ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రవల్లిక ఫ్యామిలీ తన దగ్గరికి వచ్చి జరిగిందేంటో చెప్పినట్లు వెల్లడించారు.
‘ఒకడి వేధింపుల వల్లే మా అమ్మాయి చనిపోయిందని ప్రవల్లిక తల్లి, తమ్ముడు ఆవేదన చెందారు. న్యాయం చేయాలని కోరారు. మీకు, మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పా. వాళ్ల తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం’ అని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేస్తామని, నిరుద్యోగులు తమపై విశ్వాసం ఉంచాలని కేటీఆర్ కోరారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్ళలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలని కోరారు. మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే ఉన్నాయని తెలిపారు. నేడు ఆ పరిస్థితి మారిందన్న కేటీఆర్ కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంతా సజీవ జలధారగా మారిందన్నారు. గత ప్రభుత్వాలకు దీటుగా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్లో ఉన్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో చావు దెబ్బతిన్న బండి సంజయ్ దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఎంపీ అయ్యాక కరీంనగర్ కి ఏం చేశారు? ఓ బడి తేలేదు.. కనీసం గుడి అయినా తేలేదు’. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.