టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలిపేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ‘ఏపీ హేట్స్ జగన్’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జగన్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలు, పెరిగిన ధరలు, పన్నుల భారం వంటి పలు అంశాలను ఇందులో రూపొందించారు.
ఈసందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారని చెప్పారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు, ఉపాధ్యాయులు, యువత, వికలాంగులు సహా అన్ని వర్గాల వరకు జగన్ బాధితులే అని విమర్శించారు.
సీఎం జగన్ తన దోపిడీ, అవినీతిపై ప్రజల్లో చైతన్యం వస్తే తనకు, తన ప్రభుత్వానికి సమాధి కడతారన్న భయంతోనే చేయని నేరానికి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడని మండిపడ్డారు. ప్రజల బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్ బిడ్డ.. నమ్మిన వారిని నట్టేట ముంచడమే 4ఏళ్లలో చేసిన నిర్వాకమని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి, ఇసుక దోపిడీతో రూ.40వేల కోట్లు కొట్టేయడమే జగన్ బిడ్డ చేసిన మంచి పని అని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు.
అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైందో సీఎం జగన్ మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్‌క్యాలెండర్ హామీలు తుంగలో తొక్కి యువత భవిష్యత్తును జగన్ చిదిమేశాడని ఆరోపించారు. అదేవిధంగా సీపీఎస్ రద్దుపై జగన్ ఉద్యోగులకు వివరణ ఇవ్వాలన్నారు. సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెడుతామని అచ్చెన్నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తారు.