అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గర పడుతున్న కొద్ది ముఖ్యనేతల్లో టెన్షన్ మొదలైంది. అలకలు, బుజ్జగింపులతో పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నేతల మధ్య విభేదాలు.. బీజేపీ (BJP) నాయకత్వంతో పాటు శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. రోజుకో నేత అసంతృప్తితో అలక బూనుతుండడం రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.
మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలు బాహాటంగానే అసంతృప్తిని, విభేదాలను వ్యక్తం చేస్తుండటం పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్న ఆందోళన బీజేపీ నాయకత్వంతో పాటు కార్యకర్తలను వేధిస్తోంది. ఇక ప్రస్తుతం వరంగల్ వెస్ట్ (Warangal West) బీజేపీలో అసంతృప్తి జ్వాలలు.. భగ్గుమంటున్నాయి. వరంగల్ వెస్ట్ టికెట్ రావు పద్మకు (Rao Padma) కన్ఫర్మ్ అవ్వడంతో అసంతృప్తిలో రాకేష్ రెడ్డి (Rakesh Reddy)వర్గం ఉన్నట్టు సమాచారం.
గ్రౌండ్ లెవల్లో రాకేష్ రెడ్డి అంతా సిద్దం చేసుకున్న తరువాత.. రావు పద్మకు టికెట్ ఇవ్వడం పై వరంగల్ లో బీజేపీ.. రెండు వర్గాలుగా చీలింది. రావు పద్మ పై రెబల్ గా పోటీ చేసేందుకు ఎనుగుల రాకేష్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు రాకేష్ రెడ్డి వర్గం నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోశారని ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాజాసింగ్ కి గోషామహల్ టికెట్ కన్ఫామ్ అవడంతో విక్రమ్ గౌడ్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది..
ఆదిలాబాద్ లో పాయాల్ శంకర్ ని అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ కూడా అసంతృప్తి సెగలు మొదలయ్యాయని అంటున్నారు. ఇప్పటికే అసంతృప్తులు పెరిగిపోయే అవకాశం ఉన్నందున పలు నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనను అధిష్టానం పెండింగ్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.