– గజ్వేల్ బరిలో ఈటల రాజేందర్
– కేసీఆర్ తో సై అంటే సై
– ఉద్యమ నేతల మధ్య పోలింగ్ వార్
– బీసీ మంత్రం బీజేపీకి కలిసొస్తుందా?
– కేసీఆర్ కు కొత్త చిక్కులు తప్పవా?
– గజ్వేల్ ఎన్నికపై సర్వత్రా చర్చ
గతంలో ఎన్నడూ లేనిది ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ (KCR) రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ (Gajwel) తోపాటు కామారెడ్డి (Kamareddy) లో పోటీకి సై అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సైడ్ నుంచి అనేక విమర్శలు వస్తున్నా.. గులాబీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. అయితే.. కేసీఆర్ లా మరో ఉద్యమ నేత ఈటల రాజేందర్ (Eatala Rajender) కూడా ఈసారి రెండో చోట్ల నుంచి పోటీకి దిగుతున్నారు. హుజూరాబాద్ (Huzurabad) తో పాటు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లోనూ ఢీ కొట్టనున్నారు. కేసీఆర్ ఓటమే లక్ష్యమంటూ.. గతంలో ఆయనపై పోటీ చేస్తానని ప్రకటించారు ఈటల. అన్నట్టుగానే గజ్వేల్ నుండి సీఎంపై పోరుకు సిద్ధమయ్యారు.
బీజేపీ (BJP) తొలి జాబితాలో ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుండి ఆయన్ను బరిలోకి దింపుతోంది బీజేపీ. మరి, కేసీఆర్ ను రాజేందర్ ఓడించగలరా? అక్కడి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఇలా అనేక అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్, ఈటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వీరిద్దరూ ఢీ కొడుతుండడం ఇంట్రస్టింగ్ గా మారింది.
గజ్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు బీసీలే. మొత్తం 2,51,556 మంది ఉండగా వారిలో పురుషులు 1,25,668 మంది, మహిళలు 1,25,665 మంది ఉన్నారు. వీరిలో సగానికంటే ఎక్కువమంది బీసీలే. ఇందులో ఈటల వర్గానికి చెందిన ముదిరాజ్ ఓటర్లు దాదాపు 50 వేలకు పైగానే ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందనేది రాజకీయ పండితుల వాదన. గజ్వేల్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత చాలాకాలం పాటు ఎస్సీ రిజర్వ్ గా ఉండేది. అయితే.. పునర్విభజనలో జనరల్ సీటుగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి బీసీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండడంతో ఆసక్తికరంగా మారింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు ఆకుల లలిత పోటీ చేశారు. కేవలం 1,587 (0.76 శాతం) ఓట్లు మాత్రమే రాబట్టారు. కానీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి రఘునందన్ రావు పోటీ చేశారు. ఈయనకు 2 లక్షలకు పైగానే ఓట్లు వచ్చాయి. వాటిలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి 21 వేలకు పైగానే ఓట్లు ఉన్నాయి. బీజేపీకి ఇక్కడ ఆదరణ ఉందన్న విషయాన్ని ఈ ఎన్నిక నిరూపించింది. ప్రస్తుతం ఈటల బరిలోకి దిగుతుండడంతో నియోజకవర్గంలో పార్టీకి మంచి రోజులొస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.
ఇటు, అభ్యర్థుల ఎంపికలో బీసీ వ్యతిరేకిగా కేసీఆర్ కు ముద్ర పడింది. వారికి తక్కువ టికెట్లు కేటాయించడం.. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం మైనస్ గా మారింది. ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీ ఓట్లు ఏకపక్షంగా రాజేందర్ వైపునకు వస్తే.. బీసీ ట్యాగ్ పై మరిన్ని ఓట్లు సంపాదిస్తే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు రాజకీయ పండితులు. ఒకవేళ గజ్వేల్ లో ఆయన ఓటమి పాలైనా.. హుజూరాబాద్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా గజ్వేల్ బరిలో ఇద్దరు ఉద్యమ నాయకులు ఢీ కొడుతుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.