రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం.. డిసెంబరు 8న మాసబ్ ట్యాంక్ (Massab tank)లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన ఫైళ్లను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) ఓఎస్డీ (OSD) కళ్యాణ్ (Kalyan) సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు.
ఈ క్రమంలో రాత్రి వరకి పోలీసులు ఆయనను విచారించినట్టు సమాచారం… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత కళ్యాణ్ తన పాత ఆఫీసుకు వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆఫీసులో పలు ఫైళ్లను చింపి.. చిత్తు కాగితాలుగా మార్చి బయటకి తీసుకెళ్లినట్టు ప్రచారం జరిగింది. కాగా ఆఫీస్ వాచ్ మెన్ ఫిర్యాదుతో ఈ నెల 9న కళ్యాణ్ పై నాంపల్లి (Nampally) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పశుసంవర్ధక శాఖలో పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయని, వాటిని కళ్యాణ్ తీసుకెళ్లాడంటూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కళ్యాణ్ అరెస్టును తప్పించుకునే ప్లాన్ లో భాగంగా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు పిలవడంతో సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలసాని వద్ద కళ్యాణ్ ఓఎస్ డీ గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం మారిన తర్వాత విధుల నుంచి తప్పుకొన్నారు