కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కేటీఆర్ (KTR).. హరీష్ రావు వరుసగా రేవంత్ (Revanth) సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేయడం రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు సమయం చిక్కినప్పుడల్లా తన పంచులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మరోసారి రేవంత్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. భోగి పండుగ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ కార్మికులను సన్మానించిన హరీష్ రావు.. మీడియాతో ముచ్చటించారు. ప్రజలు ఎక్కడినుంచో సిద్దిపేట అభివృద్ధిని చూడటానికి వస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాకు 22 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో అద్భుతమైన గుణాత్మక మార్పు కనిపిస్తోందని తెలిపిన ఆయన.. ఇంకా పదిశాతం జనాల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు రాష్ట్రానికి అవార్డు వస్తే కనీసం ముఖ్యమంత్రి, మంత్రులు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని హరీష్ రావు (Harish Rao) అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు వీరి తీరును గమనిస్తున్నారన్నారు. పల్లెలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందాయని, కేసీఆర్ (KCR) ముందు చూపుతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని వివరించారు. నెలరోజుల్లోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ప్రజలకు అసహనం కలుగుతోందని ఆరోపించారు.
కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడ్ని చేజేతులా ఓడించుకున్నామన్న బాధ ప్రజల్లో కనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు మాటలకు.. ప్రజల నాయకుడిని ఎవరు ఓడించలేరని.. ఒక వేళ ఓడి పోయారంటే.. అతడు ప్రజల గుండెల్లో లేరనే నిజాన్ని గమనిస్తే మంచిదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ వేస్తున్నారు.. ప్రజల మనిషి ప్రజల్లో ఉంటారు తప్పితే.. ప్రగతి భవన్ లో.. ఫామ్ హౌస్ లో ఉండరని సెటైర్లు విసిరారు..