కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్లు సమర్పించాలని ప్రకటించడంతో.. ఆధార్ సెంటర్లు (Aadhaar Centres) జనంతో కిటకిటలాడుతోన్నాయి.. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రజాపాలన ప్రారంభించిన కాంగ్రెస్.. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల కోసం అప్లికేషన్ల స్వీకరణ మొదలుపెట్టింది. ఈక్రమంలో ఉదయం నుంచే ఆధార్ అప్డేట్ కోసం మీసేవ సెంటర్ల దగ్గర జనం క్యూ కట్టారు.
ఆరు గ్యారంటీలు పొందాలంటే.. ఆ వ్యక్తి తెలంగాణలో ఆధార్ కార్డు కలిగి ఉండాలి.. దీనితో పాటు ఆధార్ కార్డు తప్పులు లేకుండా అన్ని వివరాలు సరిగ్గా ఉండాలనేది ప్రభుత్వం చెప్పిన మాట.. అయితే కొన్ని ఆధార్ కార్డులు ఏపీ పేరుతో ఉండటం, జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, అడ్రస్ మార్పులు, తప్పులు మార్చుకోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం జనం ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పలు ఆధార్ సెంటర్ల ముందు ప్రజలు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ ముందు పలు గ్రామాల నుంచి మహిళలు చిన్న పిల్లలతో కలిసి నిరీక్షిస్తున్నారు. కానీ ఒక్కోరోజు సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డా తమ వరకు రావడం లేదని జనం వాపోతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా మరిన్ని ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచాలని వేడుకొంటున్నారు.
మరోవైపు వరంగల్ జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రం వద్దకి జనం భారీగా చేరుకొన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి జిల్లాల పేర్లు చాలామందికి ఉండటంతో వాటిని మార్చుకొంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలకి టోకెన్లు పరిమితంగా ఇస్తూ ఆధార్ కార్డు మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతోన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. కాగా రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం స్కీమ్స్ దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు కీలకంగా మారింది.. అదీగాక మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు అవసరం కావడం.. కొత్త రేషన్ కార్డుల కోసం జనం తిప్పలు పడుతోన్నారు..