ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్(HMDA Ex Director) శివ బాలకృష్ణ(Shiva balakrishna)ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన వందల కోట్ల రూపాయలను భారీగా కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి ఆయన ఇంట్లో నిర్విరామంగా సోదాలు జరుగుతున్నాయి.
ఈ రోజు(గురువారం) సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రెరా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. హెచ్ఎండీఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో బాలకృష్ణ కోట్ల విలువ చేసే ఆస్తులను కూడబెట్టారు. మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రూ.400కోట్ల వరకు ఉంటుందని అంచనా.
బుధవారం ఉదయం నుంచి ఏసీబీ 20 బృందాలుగా విడిపోయి 17చోట్ల సోదాలు నిర్వహించింది. శివ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. నానక్ రామ్ గూడలోని బాలకృష్ణ ఇంట్లో రూ.84లక్షల నగదు స్వాధీనం చేసుకోగా హైదరాబాద్లో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం చేసుకోగా 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు.. పెద్ద మొత్తంలో ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాల, జనగామలో 24 ఎకరాల లాంటి పత్రాలు స్వాధీన పరుచుకున్నారు.
భూములన్నింటినీ బినామీల పేర్ల మీద ఉంచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాలకృష్ణను ఇవాళ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. బాలకృష్ణ రేరాలో సెక్రెటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్స్ సంస్థలకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోదాలు నిర్వహిస్తుండగా ఆయన కుటుంబసభ్యులు ఎవరూ తమకు సహకరించలేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు.