ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. లంచాలకు మరిగిన ప్రభుత్వ అధికారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఏసీబీ(ACB) అధికారులు ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా మెడికల్ బిల్లులు చెల్లించడానికి ఓ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఆ సూపరింటెండెంట్ ఏకంగా రూ.3లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో చేసేది లేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఆ సూపరింటెండెంట్‌ను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న అనే వ్యక్తి నల్లగొండ(Nallagonda) ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్(Superintendent) లచ్చునాయక్‌ను మెడికల్ బిల్లులను కోరాడు. దీనికి ఆయన రూ.3లక్షలు డిమాండ్ చేశాడు.
బాధితుడు చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం లచ్చు నాయక్ ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.