Accident: ఏపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఏపీ అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో 100 అడుగుల లోతున ఆర్టీసీ బస్సు పడిపోవడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా 30 మంది గాయపడ్డారు. చోడవరం నుంచి ఈ బస్సు పాడేరు బయల్దేరిందని, ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్దకు చేరుకోగానే లోయలో పడిపోయిందని తెలుస్తోంది.
ఘటనా స్థలంలో ఫోన్ సిగ్నల్స్ కూడా లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో మహిళలు , చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేబట్టారు.
ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్మోహన రెడ్డి..క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. వీలయితే వారిని విశాఖ తరలించాలని సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ప్రమాద క్షతగాత్రులకు వెంటనే వైద్య సాయం అందించాలని కోరారు.
ఉత్తరాఖండ్ లో ప్రమాదం
ఉత్తరాఖండ్ గంగోత్రిలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోగా ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు గంగోత్రి ధామ్ నుంచి ఉత్తర కాశీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులను రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు . బస్సులో 33 మంది భక్తులు ఉన్నట్టు సమాచారం.