పంజాగుట్ట (Panjagutta) ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు బోధన్ (Bodhan), బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు లుక్ అవుట్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో డీసీపీ విజయ్ కుమార్ (DCP Vijay Kumar) కీలక విషయాలను వెల్లడించారు. ప్రజాభవన్ (Praja Bhavan) ముందు యాక్సిడెంట్ కేసులో A3 గా ఉన్న షకీల్ పరారీలో ఉన్నారని తెలిపారు. సొహైల్, షకీల్ ఇద్దరు దుబాయ్ లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.
ప్రధాన నిందితుడు సొహైల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని వెల్లడించిన డీసీపీ.. ఈ కేసులో A1గా సోహైల్, A2గా అబ్దుల్, A3 గా షకీల్ ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని.. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్, బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేశామని వివరించారు.
ఈ ఘటనలో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు 2022 మార్చిన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్లో సైతం షకీల్ కొడుకు నిందితుడిగా ఉన్నాడని, అప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే తన కొడుకుని తప్పించారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ కేసును కూడా ఇపుడు తిరిగి విచారణ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆ కేసు కోర్టులో ట్రయల్ జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు డిసెంబర్ 23న హైదరాబాద్, ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను..సొహైల్.. కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అయితే.. పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన నిందితున్ని తప్పించి.. అతని డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.