అయోధ్య(Ayodhya)లో నూతనంగా నిర్మించిన రామాలయం(Ram Mandir) ప్రారంభోత్సవ వేడుకకు విపక్ష నేతలు దూరంగా ఉండటం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత(Congress Leader) ఆచార్య ప్రమోద్ కృష్ణం(Acharya Pramod Krishna)అన్నారు.
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కాబోమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సహా పలువురు విపక్ష నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని మన్నించకపోవడమంటే భారత నాగరికత, సంస్కృతిని అవమానించడమేనని పేర్కొన్నారు. భారత్ ఉనికిని, గౌరవాన్ని ప్రశ్నించడమేనని ఆక్షేపించారు. విపక్షాలు బీజేపీతో పోరాడాలని రాముడితో కాదని తాను చెప్పదలుచుకున్నానని అన్నారు.
శ్రీరాముడు భారత్ ఆత్మ అని, ఈ కార్యక్రమానికి హాజరు కారాదని విపక్షాలు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చివరికి క్రైస్తవుడు, ముస్లిం కూడా శ్రీరాముడి ఆహ్వానాన్ని విస్మరించరని, భారత్ రాముడి ఆత్మ అని, రాముడు లేకుండా భారత్‌ను ఊహించలేమని ఆచార్య ప్రమోద్ అన్నారు.
బీజేపీతో పోరాడండి కానీ సనాతనంతో కాదని, బీజేపీతో పోరాడండి కానీ భారత్‌తో పోరాడకండని ఆయన విపక్షాలకు హితవు పలికారు. మరోవైపు విపక్ష నేతలు రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరవకుండా రాముడి వ్యతిరేకులుగా వ్యవహరించారని బీజేపీ విరుచుకుపడుతోంది.