అదానీ- హిండెన్‌బర్గ్ (Adani Hindenburg Case) వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో సిట్ విచారణకు సుప్రీం కోర్టు నో చెప్పింది. రెగ్యులేటరి సంస్థ ఫ్రేమ్ వర్క్‌లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సెబి తన ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని సూచించింది. మూడు నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
థర్డ్ పార్టీలు సమర్పించే నివేదికలను పూర్తి నిర్ణయాత్మక ఆధారాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదానీ కంపెనీలపై ఆరోపణలను రుజువు చేసేందుకు పక్కా ఆధారాలు అవసరమని పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 24 ఆరోపణలు రాగా వాటిపై 22 ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేసిందని కోర్టు వెల్లడించింది. అందువల్ల సెబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హిండెన్ బర్గ్ నివేదికలో షార్ట్ సెల్లింగ్ ఉల్లంఘనలను ప్రభుత్వం, సెబీ పరిశీలించాలని ఆదేశించింది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే చట్ట ప్రకారం వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది ఇలా వుంటే సుప్రీం కోర్టు తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పును చదవలేదని చెప్పారు.
కానీ రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిసిందన్నారు. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ సంస్థ ఏడాది క్రితం ఆరోపణలు చేసిందని తెలిపారు. ఒక వేళ సెబీ అలర్ట్ గా ఉన్నట్టయితే అప్పుడే స్పందించేదన్నారు. చాలా రోజుల క్రితమే సెబీ తన దర్యాప్తును పూర్తి చేసి ఉండేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సత్యం విజయం సాధించిందన్నారు. తన పక్షాన నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.