అధికార కాంగ్రెస్ (Congress) రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు.. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆయన.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు..
ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, మోడీ విషం కక్కుతున్నారని ఆరోపించారు. పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో జరిగిన జన జాతర సభలో పాల్గొన్న ఆయన.. జిల్లాలో కొత్తగా విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని, కుప్టి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామన్న సీఎం.. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చారు.
నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో ఆదిలాబాద్ (Adilabad)లో సిమెంట్ పరిశ్రమను నిర్మించామని గుర్తు చేసిన రేవంత్.. ప్రధాని, కేసీఆర్ (KCR) కలిసి సీసీఐ పరిశ్రమను మూసివేశారని ఆరోపించారు. ఆ పరిశ్రమను త్వరలో తెరిపిస్తామని వెల్లడించారు. అదేవిధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ త్వరలో చేస్తామన్నారు.
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గుర్తు చేశారు. పేదల ఇంట్లో వెలుగులు చూసి మోడీ, కేసీఆర్ కడుపు మండుతుందని విమర్శించారు. నిధులన్నింటినీ ప్రధాని గుజరాత్‌కు తరలిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే, కాంగ్రెస్ 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు తెలిపిన రేవంత్.. ఇప్పటి వరకు 35 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు.
మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించిన సీఎం.. మోడీ (Modi), కేసీఆర్ తొడుదొంగలని ఆరోపించారు. డిసెంబర్ లో కేసీఆర్ ను బండకేసి కొట్టారు… రేపు మోడీని కూడా గోడకేసి కొట్టాలి.. బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మీ సంక్షేమం కోరే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి.. ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణను గెలిపించండని కోరారు..