Aditya : చంద్రయాన్-3 సక్సెస్ కి కేవలం కొద్దిదూరంలోనే ఉన్న ఇస్రో (Isro) మరో సాహసోపేత మిషన్ కి నడుం బిగించింది. మొదటిసారిగా సౌర వ్యవస్థ రహస్యాలు తెలుసుకునేందుకు సూర్యుడికి సంబంధించిన విశేషాలపై ఫోకస్ పెట్టింది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ను ప్రయోగించడానికి సిద్ధం చేసింది. పీఎస్ ఎల్వీ -సి 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1 ని శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబోతున్నారు. బెంగళూరు లోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్రో వర్గాలు తెలిపాయి.
వివిధ పరీక్షలు నిర్వహించి ప్రత్యేక వాహనంలో ఈ ఉపగ్రహాన్ని ఇక్కడకు చేర్చారు. భారత తొలి సోలార్ మిషన్ అయిన ఆదిత్య-ఎల్ 1 ని ఈ నెలాఖరులో గానీ, సెప్టెంబర్ మొదటివారంలో గానీ లాంచ్ చేయనున్నట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ రాకెట్ కి అదనపు పే లోడ్స్ టెస్ట్స్ కూడా నిర్వహించాలని రివ్యూ కమిటీ సిఫారసు చేసిందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ (S.Somanath) తెలిపారు. భూమి నుంచి పదిన్నర లక్షల కి.,మీ. దూరంలో హాలో కక్ష్య (Orbit) లో దీన్ని ప్రవేశపెట్టాలన్న ప్లాన్ ఉందని, సౌర సంబంధ విశేషాలను, అంతరిక్షంపై ఇవి చూపగల ప్రభావాన్ని పరిశోధించవలసి ఉందని ఆయన అన్నారు
సూర్యుని బాహ్య వలయాలను అధ్యయనం చేసేందుకు ఈ స్పేస్ క్రాఫ్ట్ 7 పే లోడ్లను మోసుకువెళ్తుందని, పైగా ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్, పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్లను వినియోగించుకుంటుందని ఆయన వివరించారు. నాలుగు పే లోడ్లు నేరుగా సూర్యుని అభిముఖంగా, మిగిలిన మూడు పార్టికల్స్ కు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తాయని సోమనాథ్ చెప్పారు. సౌర తుఫాన్లపైనా, ఆ సమయంలో జరిగే మార్పులపై కూడా ఈ శాటిలైట్ పరిశోధనలు చేస్తుందన్నారు. కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సౌర వ్యవస్థను నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఆయన చెప్పారు.
సుమారు 1500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ ను ప్రత్యేకంగా స్టడీ చేయనుంది. చంద్రయాన్-3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో చేబడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సూర్య గోళం నుంచి ప్రసరించే శక్తిమంతమైన కాంతి పుంజాన్ని స్టడీ చేసేందుకు అనువుగా పే లోడ్స్ ని రూపొందించడం విశేషం,