ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో దారుణ ఘటన చోటు చేసుకొంది. మందుపాతర పేలి 9 మంది చిన్నారులు మృత్యు వాతపడ్డారు.. ఆఫ్ఘనిస్థాన్‌లోని గజ్నీ ప్రావిన్స్ (Ghazni Province)లోని గెరు జిల్లాలో (Geru district) మందుపాతర పేలడంతో తొమ్మిది మంది చిన్నారులు మరణించారని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వారంతా మందుపాతరతో ఆడుకొంటున్న సమయంలో అది పేలిందని తెలిపారు..
ఈ సంఘటనలో ఐదుగురు బాలికలతో సహా 4-10 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు విగతజీవులుగా మారారని పేర్కొన్నారు. అయితే పిల్లలకు తెలియక పాత ల్యాండ్ మైన్ (Old Landmine)తో ఆడుకొన్నారని తాలిబాన్ అధికార ప్రతినిధి తెలిపారు.. దీంతో అది కాస్తా పేలడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ఆఫ్ఘనిస్థాన్ కరువు కాటకాలతో అల్లాడుతోంది.
మరోవైపు తాలిబన్లు ఇక్కడి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకొన్నారు. దీంతో ఇతర దేశాలతో ఆఫ్ఘనిస్థాన్ కు సంబంధాలు తెగిపోయాయి. వీరి పాలనతో ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి.. అలాగే 1979లో జరిగిన సోవియట్ దండయాత్రలో పెద్ద మొత్తంలో గ్రెనేడ్లు వాడినట్లు తెలుస్తోంది. అయితే పేలని ఆయుధాలు ప్రస్తుతం ప్రాణాలను బలిగొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..