AkhileshYadav :ప్రభుత్వానికి దమ్ముంటే జీ 20 ఈవెంట్ ను మణిపూర్ లో నిర్వహించాలని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav ) సవాల్ విసిరారు. ఆ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు నిర్వహించడం లేదన్నారు. రాష్ట్రంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్రం చెబుతోందని, మరి ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.’ జీ 20 కా చునావ్ కనెక్షన్’ పేరిట శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూపీ లోను, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ జీ 20 సదస్సులను నిర్వహించారని, కానీ ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకోవడం లేదన్నారు.
ఈ ఈవెంట్ల ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ కోరుకుంటున్నప్పుడు ఆ పార్టీ వీటిని స్పాన్సర్ చేయాలని, కానీ ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారులు ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారని ఆయన అన్నారు. మీకు ధైర్యముంటే జీ20 సదస్సును మణిపూర్ లో నిర్వహించండి అని వ్యాఖ్యానించారు. ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మణిపూర్ లో పరిస్థితి బాగానే ఉందని ప్రపంచానికి చాటాలని అన్నారు.
విపక్ష కూటమి ‘ఇండియా’ను ప్రధాని మోడీ ఘమండియా అని ఆరోపిస్తున్నారని అయితే ఈ కూటమిని ఇలా విమర్శిస్తున్నవారే అహంకారులని అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.
కుటుంబ రాజకీయాల గురించి మోదీపదే ఆరోపణలు చేస్తున్నారని, కానీ జ్యోతిరాదిత్య సింధియా, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి విషయమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పగలుగుతానన్నారు. దేశంలో ఈ రోజు పెద్ద పరివార్ వాద్ పార్టీ బీజేపీయేనని అన్నారు. ఒకరిని విమర్శించే ముందు ఆ పార్టీ తన పొరబాట్లను తెలుసుకోవాలని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.