బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) పై మొదటి నుంచి వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే.. తప్పుల తడకలా ధరణి పోర్టల్ రూపొందించారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ధరణి వల్ల రైతులకి న్యాయం జరగలేదనే వాదనలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ధరణి పోర్టల్ మార్చాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత ఆనే పేరుతో రైతుకి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం..
అయితే ధరణిలో మార్పు.. భూమాత ఎలా ఉండాలి అనే అంశంపై కీలక సూచనలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Akunuri Murali).. వాయిస్ ఆఫ్ తెలంగాణ (Voice Of Telangana) ఆధ్వర్యంలో ఖైరతాబాద్ (Khairatabad) వాసవీ క్లబ్ లో ‘‘ధరణిలో మార్పు రావాలి.. భూమాత ఎలా ఉండాలి’’ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న మురళి.. తహశీల్దార్లకు, కలెక్టర్లకు, ధరణి పోర్టల్ సాఫ్ట్ వేర్ పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు.
భూమిపై మంచి అవగాహన ఉన్న మాజీ అధికారులతో కమిటీ వేస్తే.. సమస్య తీరుతుందని తెలిపిన మురళి.. ఈ కమిటీలో ఒక వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామానికి.. గ్రామ రెవెన్యూ అధికారి ఉండేలా చూడాలని.. దాని వల్ల గ్రామస్థాయిలోనే పరిష్కారం దొరుకుతుందని మురళి అభిప్రాయపడ్డారు.
మరోవైపు తహశీల్దార్లకు పవర్ లేకుండా పోయినందు వల్ల.. గ్రామాల్లో రైతులకు సమస్యలు వస్తే చెప్పుకోవడానికి ఎవరూ లేరని, మురళి ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సమస్యలు వస్తే సిటీలకు రావలసిన అవసరం ఏర్పడిందని.. దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని మురళి పేర్కొన్నారు. అధికారులకు లంచం ఇస్తే అన్ని వివరాలు మారిపోతున్నాయని, అలా జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు మురళి..