వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం అని మంగళగిరి ఎమ్మెల్యే (Mangalagiri MLA) ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తన రాజీనామాకు గల కారణాలను త్వరలోనే పూర్తిగా వెల్లడిస్తానని చెప్పిన ఆయన తాజాగా రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేశారు.
వైఎస్ షర్మిల రాజకీయాలపై తన నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తానని ఆర్కే స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా చంద్రబాబు, లోకేష్‌తో పాటు సీఎం జగన్ ఏమైనా తప్పులు చేస్తే తప్పకుండా కేసులు వేస్తానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళగిరి అభివృద్ధికి రూ.1200కోట్లు కేటాయిస్తే ఆనందించామని, అయితే కరోనా సాకు చూపుతూ.. ఆ నిధులను కుదించుకుంటూ వస్తూ చివరికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
వైసీపీలో తాన సేవలను సీఎం జగన్ గుర్తించలేదని ఆర్కే వాపోయారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం ఇలాంటి నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలి అంటే.. ఆ నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి చేయాలో అంత స్థాయిలో చేయలేదని.. మరి ఎలా గెలిపిస్తారు? అని ప్రశ్నించారు. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను.. మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయాలనుకుంటే రెండేళ్ల క్రితం రాజీనామా చేసేవాడ్ని కాదా? అని ప్రశ్నించారు.
ఎన్నిసార్లు సీఎంవో చుట్టూ తిరిగిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవోలో అధికారులు, ఎమ్మెల్యేలను పురుగులు చూసినట్లు చూశారని అన్నారు. అలాంటి పార్టీలో తాను ఎందుకు ఉండాలన్న ఆలోచనతోనే రాజీనామా చేశానని తెలిపారు. ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని, ఇక తనకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆర్కే. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోనని చెప్పారు.
కాగా, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్కేకు అసెంబ్లీ సీట్లు లేదనే సమాచారంతో ముందే ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి పొలిటికల్ హీట్ పెంచారు.