నల్గొండ (Nalgonda) జిల్లాలో సందడి చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన తన మామ చంద్రశేఖర్ రెడ్డి.. భట్టుగూడెం దగ్గర కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. దీన్ని తన చేతులమీదుగా ఓపెన్ చేశారు బన్నీ. అత్యాధునిక వసతులతో వెయ్యి మందికి సరిపడేలా ఈ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekar Reddy).
బన్నీని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి జనం భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది. తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Fans) సంబరపడ్డారు. ఇక, ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
బన్నీ భార్య స్నేహారెడ్డి (Sneha Reddy) తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఫౌండేషన్ పేరుతో కొన్నాళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తనకు అధిష్టానం టికెట్ ఇస్తే గెలిచి తీరుతానని ధీమాగా చెబుతున్నారు. పైగా, ప్రచారానికి తన అల్లుడు అల్లు అర్జున్ ని తీసుకొస్తానని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని.. తన కోసం అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని వెల్లడించారు చంద్రశేఖర్. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. కానీ, అప్పట్లో అర్జున్ ప్రచారం చేయలేదు. కానీ, ఈసారి మాత్రం అల్లుడి ఇమేజ్ ని వాడేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు చంద్రశేఖర్ రెడ్డి.