Telugu News » BRS Party : బీఆర్ఎస్ లో జగడాలు.. కేసీఆర్ కు తలనొప్పులు

BRS Party : బీఆర్ఎస్ లో జగడాలు.. కేసీఆర్ కు తలనొప్పులు

ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు స్వరం పెంచారు. తమకు పోటీగా ఉంటున్న వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

by admin
CM KCR Comments On Revanth Reddy And Kishan Reddy

– ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో గొడవలు
– కొన్నిచోట్ల ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే
– ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మాజీల మధ్య వార్
– ఇన్నాళ్లూ చాపకింద నీరులా వ్యవహారం
– కానీ, ఇప్పుడు డైరెక్ట్ ఎటాక్
– నేతల మధ్య మాటల యుద్ధం
– పోటాపోటీ నిరసనలకు దిగిన అనుచరగణం

ముచ్చటగా మూడోసారి గెలిచి సౌత్ లో హ్యాట్రిక్ కొట్టిన తొలి సీఎంగా రికార్డ్ సృష్టించాలని కేసీఆర్ (KCR) అనుకుంటున్నారు. దీనికోసం అనేక వ్యూహాల్లో ఆయన ఉన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో ఎవరికి సీటు ఇవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారట. అయితే.. ఈలోపు జరగాల్సిన నష్టం జరుగుతుందనేది రాజకీయ పండితుల వాదన.

clashes-in-brs-party

తెలంగాణ (Telangana) ను రెండు పర్యాయాలుగా శాసిస్తున్నారు కేసీఆర్. ఇన్నేళ్లలో ఇతర పార్టీలకు చెందిన చాలామంది నాయకులకు గులాబీ కండువా కప్పేశారు. దాని ఫలితంగా కారు పార్టీ నాయకులతో ఫుల్ అయింది. ఇప్పుడు టికెట్ల టైమ్ రావడంతో.. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు స్వరం పెంచారు. తమకు పోటీగా ఉంటున్న వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు.

జనగామ బీఆర్ఎస్ (BRS) లో టికెట్ పంచాయితీ తారాస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి కి టికెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లాకు వ్యతిరేకంగా జనగామ చౌరస్తాలో ముత్తిరెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. పల్లా గో బ్యాక్ అంటూ పార్టీ జెండాలతో పాటు, నల్లజెండాలు, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారు. మూడోసారి కూడా ముత్తిరెడ్డిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఇక ఇదే స్థానం కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా పోటీకి సై అంటున్నారు. టికెట్‌ ఇవ్వకపోతే ముత్తిరెడ్డి వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటు స్టేషన్‌ ఘన్‌ పూర్‌ సంగతి సరేసరి.. ఇక్కడ చాలారోజులుగా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియ శ్రీహరి మధ్య వార్ నడుస్తోంది. ఈమధ్య అయితే పీక్స్ కు చేరింది. వీళ్ల పంచాయితీ ఆఖరికి ప్రగతి భవన్ వరకు వెళ్లింది. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న వ్యవహారం.. తాజాగా మళ్లీ రాజుకుంది. తనకే టికెట్‌ వస్తుందన్న నమ్మకం ఉందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించగా.. అంత సీన్ లేదని అంటున్నారు కడియం శ్రీహరి. తనకు ప్రజలు ఆశీర్వాదం అందిస్తే నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని చెబుతున్నారు. ఈ క్రమంలోనే క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయి నిరసనలకు దిగుతోంది. వేలేరులో కడియంకు వ్యతిరేకంగా రాజయ్య వర్గీయులు నినాదాలు చేశారు. స్టేషన్ ఘన్‌ పూర్‌ టికెట్‌ శ్రీహరికి ఇవ్వొద్దని ఆందోళన చేశారు. ప్రస్తుతానికి ఇవే. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుందని.. బీఆర్ఎస్ లో కుమ్ములాటలు తప్పవని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు.

You may also like

Leave a Comment