ఇటీవల అమెరికా(America)లో పైచదువులకని వెళ్లిన విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రేయాస్ రెడ్డి బెణిగేరి(Shreyas Reddy Benigeri) అనే భారతీయ విద్యార్థి అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
ఒహియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే శ్రేయాస్ రెడ్డి మృతికి కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. శ్రేయాస్ రెడ్డి సిన్సినాటిలోని లిండర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్(Lindern School of Business) విద్యార్థి. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది.
విద్యార్థి శ్రేయాస్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. పోలీసుల విచారణ జరుగుతోందని, మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రేయాస్ రెడ్డి కుటుంబంతో టచ్‌లో ఉన్నట్లు ట్వీట్‌లో ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది.
ఈ ఏడాదిలో ఇది నాలుగో ఘటన. 2024 ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలోనే అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. నీల్ ఆచార్య, వివేక్ షైనీ, ఆకుల్ ధావన్ అనే ముగ్గురు విద్యార్థులు జనవరి నెలలో మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రేయాస్‌రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.