బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. బీజపీ గెలిస్తే రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
పేద మహిళలకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం అవుతుందని చెప్పారు. తాము గెలిస్తే తెలంగాణ ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని ఆరోపణలు గుప్పించారు. ఓవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీఆర్ఎస్ సర్కార్ నిర్వహించడం లేదన్నారు. మజ్లిస్‌కు భయపడి 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు చేశారని ఆరోపించారు. తెలంగాణకు మోడీ సర్కార్ రూ.7 లక్షల కోట్లు ఇచ్చిందని షా గుర్తుచేశారు.