ఛత్తీస్‌గఢ్‌లో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో 29 మంది మావోయిస్టుల మృతి చెందినట్లు భద్రత దళాలు పేర్కొన్నాయి. అయితే తాజాగా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశ అభివృద్ధికి అతిపెద్ద శత్రువుల్లా మావోయిస్టులు తయారయ్యారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశం మొత్తాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేస్తామన్నారు..
రాష్ట్రంలో భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయని తెలిపిన అమిత్ షా.. మోడీ (Modi) ప్రధాని అయినప్పటి నుంచి నక్సలిజం, టెర్రరిజానికి వ్యతిరేకంగా బీజేపీ (BJP) నిరంతర ప్రచారం సాగిస్తూందని, అలాగే 2014 నుంచి ఇప్పటి వరకి 250 శిబిరాలను ఏర్పాటు చేస్తూ వస్తుందని పేర్కొన్నారు.. మావోయిస్టులను (Maoist) అరికట్టేందుకు కృషి చేస్తుందని తెలిపారు..
మరోవైపు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), కాంకెర్లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని తెలిపిన ఆయన.. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నట్లు పేర్కొన్నారు.. అలాగే ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలో 80 మందికి పైగా నక్సలైట్లు హతమయ్యారని వెల్లడించారు.
మరో 125 మందికి పైగా అరెస్టవ్వగా..150 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ విధానాల వల్ల మావోయిస్టులు ఇప్పుడు చిన్న ప్రాంతానికి పరిమితమయ్యారన్నారు. త్వరలోనే ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశమంతా నక్సల్స్ రహితంగా మారుతుందని స్పష్టం చేశారు. ఇక మావోయిస్టు ప్రభావిత బస్తర్ లోక్‌సభ స్థానంలో ఈనెల 19న పోలింగ్ జరుగనుంది..