కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను త్వరలోనే నోటిఫై చేస్తామని తెలిపారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల లోపే సీఏఏను అమలు చేస్తామని వెల్లడించారు. దాన్ని ఈ దేశ చట్టం అని పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన ఈటీ బిజినెస్ సమ్మిట్‌లో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. సీఏఏ చుట్టూ ఎలాంటి గందరగోళం ఉండకూడదని చెప్పారు. మన దేశంలోని మైనారిటీలు, ముఖ్యంగా మన ముస్లిం సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి రెచ్చగొడుతున్నారని అన్నారు. చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని కూడా లాక్కోదని స్పష్టం చేశారు.
సీఏఏ అనే చట్టం ఈ దేశ పౌరులకు పౌరసత్వాన్ని అందజేస్తుందే తప్ప…ఎవరి పౌరసత్వాన్ని హరించదని వివరించారు. సీఏఏ అనేది బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో వేధింపులకు గురైన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టమని వివరించారు. దేశంలో సీఏఏని అమలు చేస్తామన్న హామీని గత కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని షా ఆరోపించారు.
సీఏఏ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన హామీ అని తెలిపారు. దేశం విడిపోయి, ఆయా దేశాల్లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నప్పుడు, శరణార్థులకు భారత్‌లో స్వాగతం పలుకుతామని, వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు.