– ఉద్యోగాలన్నారు.. ఎన్ని భర్తీ చేశారు
– రూ.లక్ష రుణ మాఫీ అన్నారు.. ఏం చేశారు?
– నిరుద్యోగులకు భృతి అన్నారు.. ఎక్కడిచ్చారు?
– ఆదుకుంటారని ఓట్లేసి గెలిపిస్తే అవినీతి చేశారు
– ప్రతీ దాంట్లో కమీషన్లు నొక్కేశారు
– మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు
– బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి
– అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం
– కాంగ్రెస్, ఎంఐఎంకు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే
– కుటుంబ పార్టీలను నమ్మొద్దు
– రాష్ట్ర ప్రజలకు అమిత్ షా సూచన
బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కుమ్మక్కయ్యాయనేది కాంగ్రెస్ (Congress) వాదన. కాషాయ నేతలు మాత్రం దీన్ని గట్టిగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్సే కలిసి డ్రామాలు ఆడుతున్నాయని.. కేసీఆర్ (KCR) ను జైలుకు పంపుతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్న అగ్ర నేతలంతా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడిని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పాపాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరుల త్యాగాలతో తెలంగాణ (Telangana) ఏర్పడిందని.. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంపై కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే, ముస్లిం రిజర్వేషన్లను తీసివేస్తామని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న ఆయన.. లక్ష ఉద్యోగాలన్నారు.. ఎన్ని భర్తీ చేశారంటూ ప్రశ్నించారు. రైతులకు లక్ష రుణ మాఫీని చేయలేదని.. నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదని ఫైరయ్యారు.
ఈసారి ఎన్నికలు చాలా కీలమన్న అమిత్ షా.. మీ ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రజలకు సూచించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. ప్రతీ దాంట్లో కమీషన్లు నొక్కేశారని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని.. యువత, రైతులు, పేదలందరూ నిరాశలో ఉన్నారన్నారు. మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రం.. ఇప్పుడు అప్పులకుప్పగా మారిందంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ సహకరించకపోయినా.. తాము కేంద్ర పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని స్పష్టం చేశారు షా. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ పేదలను అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో మార్పు అన్నది బీజేపీతోనే సాధ్యమని.. రాష్ట్రంలో పండిన ప్రతి పంటను తామే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అలాగే, బాయిల్డ్ రైస్ కూడా కొంటామని కీలక హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారని వివరించారు. తెలంగాణకు కేంద్రం 9 సంవత్సరాల కాలంలో రూ.2.5 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. 900 కోట్ల రూపాయలను సమ్మక్క గిరిజన యూనివర్సిటీకి విడుదల చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బంధు పథకాలు వస్తున్నాయని అన్నారు అమిత్ షా. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరటం ఖాయమని విమర్శించారు. అందుకే, బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఇటు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు షా. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందే ఆ పార్టీ అని గుర్తు చేశారు. అంజయ్యను, పీవీ నర్సింహరావులను అవమానించిందన్నారు. వీటిని తెలంగాణ ప్రజలు మరచిపోరని తెలిపారు.
కాంగ్రెస్ కి ఓటు వేసినా, మజ్లీస్ కి వేసినా అది బీఆర్ఎస్ కే పోతుందని అన్నారు. ఈ మూడు కుటుంబ పార్టీలు.. ఎన్నికలకు ముందు వివిధ ఎజెండాలు, నినాదాలతో వస్తాయని.. అయిపోయాక కలిసి పోతాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చామని.. బీసీ ని సీఎం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు.. వాళ్లు బీఆర్ఎస్ లో చేరారు.. బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అవినీతికి పాల్పడిండి.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు అమిత్ షా.