తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ (BJP)లో అంతర్మథనం మొదలైంది. ఈ ఫలితాలపై బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ దశలో రాష్ట్రంలో తిరుగులేని శక్తి ఉన్న పార్టీ తిరోగమనం చెందడంపై అగ్రనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా క్రమ శిక్షణకు పెట్టింది పేరుగా ఉన్న పార్టీలో గ్రూపు రాజకీయాలపై అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
తాజాగా తెలంగాణ పర్యటనలో భాగంగా నగరంలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. తాజా పర్యటనలో బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ పీకారు. చేజేతులా తెలంగాణలో అధికారాన్ని వదులుకున్నామని రాష్ట్ర నేతలపై ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. అనుకున్న స్థాయిలో అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వర్గ విభేదాలే కొంప ముంచాయని తెలిపారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించబోమని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పార్టీకి ఓటింగ్ శాతం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలంతా సమన్వయంతో పని చేయాలని బీజేపీ శ్రేణులకు షా దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో అత్యదిక ఎంపీ సీట్లలో విజయమే టార్గెట్‌గా పార్టీ శ్రేణులు సమిష్టింగా పని చేయాలని సూచించారు.
ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400 పైగా సీట్లు గెలుస్తామని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. గత ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, కానీ ఈ సారి 8 సీట్లు వచ్చాయని వెల్లడించారు. కార్యకర్తలంతా సమిష్టిగా పని చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తామన్నారు. రాష్ట్రంలో 64 నుంచి 95 వరకు సీట్లు రావచ్చన్నారు.
ఈసారి అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామన్నారు. సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం ఇస్తామని షా స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల సర్వే నిర్వహించి బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తామన్నారు. సమావేశం అనంతరం అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లోని శ్లోక కన్వెక్షన్‌లో జరిగే బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలాన్‌లో శ్లోక కన్వెక్షన్‌లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో 25 శాతానికి పైగా ఓట్లు 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ తని అని భావించి పనిచేయాలన్నారు.
గత కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. మాదిగ సమాజానికి న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని పేర్కొన్నారు. ముందుగా సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని డీకే అరుణ ప్రవేశపెట్టారు. రాబోయే ఎన్నికల్లో మోడీ విజయం చారిత్రక అవసరమనే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని పార్టీ ఏకగీవ్రంగా ఆమోదించింది.