ఖలిస్తాన్ (Khalistan)ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. కాలిఫోర్నియాలో ఓ హిందూ ఆలయం (Hindu Temple )పై ఖలిస్తాన్ మద్దతుదారులు గ్రాఫిటీ పెయింట్స్ తో దాడి చేశారు. హేవార్డ్ లోని షెరావలి ఆలయం గోడలపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఈ విషయాన్ని హిందూ అమెరికా ఫౌండేషన్ (HAF) ట్వీట్ చేసింది.
‘మోడీ ఓ టెర్రరిస్ట్ అని, ఖలిస్తానీ జిందాబాద్’అని ఖలిస్తాన్ మద్దతుదారులు రాసిన ఫోటోలను హెచ్ఏఎఫ్ ట్విట్టర్లో పోస్టు చేసింది. కాలిఫోర్నియాలోని రామ నివార్క్ స్వామి నారాయణ్ ఆలయం ఘటన మరువక ముందే ఈ ఘటన జరిగినట్టు పేర్కొంది. ఈ ఘటనపై అల్మెడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.
గతేడాది డిసెంబర్ 23న కాలిఫోర్నియా నివార్క్లో స్వామినారాయణ్ దేవాలయంపై గోడలపై ఖలిస్తాన్ గ్రాఫిటీ రాతలు రాశారు. దీంతో పాటు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న ఓ భక్తుడు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనను యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఖండించింది. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ ఘటనను ఖండించారు. భారత్ వెలుపల ఉన్న తీవ్రవాదులు, వేర్పాటువాద శక్తులకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై తమ కాన్స్యులేట్ ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.